జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేపట్టాలి: సీపీఎం డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 16: నర్సాపూర్లోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో ఫుడ్ పాయిజన్కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించాలని సీపీఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేష్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్లకు వినతిపత్రం అందజేసింది.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ మాట్లాడుతూ.. నర్సాపూర్లోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో ఆహారం తిని 36 మంది అస్వస్థతకు గురికాగా, సాయి అనే యువకుడు మృతిచెందిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజల ఆకలి తీర్చాల్సిన హోటళ్లు, రెస్టారెంట్లు అపరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆహార పదార్థాల్లో అధిక మోతాదులో మసాలాలు, కారం, రసాయనాలు వినియోగించడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒకరు మృతిచెందిన మరుసటి రోజే అదే మండలంలో ఇడ్లీలో పురుగు కనిపించిందన్న విషయం హోటళ్ల నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనల ప్రకారం అనుమతులు పొందుతున్నాయా లేదా అన్నది అధికారులు పరిశీలించాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని, ఆహార నాణ్యత, వంటగదులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్కు కారణమైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని ప్రభుత్వం, రెస్టారెంట్ యాజమాన్యం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె. మల్లేశం, పార్టీ సభ్యులు యాదగిరి, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.






























