ప్రతిపక్షం, నవంబర్ 27: తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ, ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిల వసూలు, విద్యుత్ నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.
రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్‌ఎస్) కింద విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.25,096 కోట్ల విలువైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ఈ ఏడాది మే 27న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ నష్టాల నియంత్రణ, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంపు వంటి పనులు ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈ పథకం కింద తెలంగాణకు కేవలం రూ.72 కోట్ల బడ్జెట్ సహాయం మాత్రమే అందిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు నివేదికలకు 60 రోజుల్లో ఆమోదం తెలపాలని, పనులు పూర్తి చేసేందుకు 2028 మార్చి 31 వరకు గడువు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ విద్యుత్ నిల్వ వ్యవస్థలు కీలకమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 92 గిగావాట్ అవర్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం కోసం రూ.14,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఈ నిధులు అందే అవకాశం లేకపోవడాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులకు కూడా మెగావాట్‌కు రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తెలంగాణ జెన్‌కో చేపట్టనున్న కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చేపట్టిన 2,000 మెగావాట్ అవర్ల బ్యాటరీ విద్యుత్ నిల్వ ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల విధానంలో పారదర్శకత అవసరమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ విధానానికి తెలంగాణ మద్దతు ఇస్తున్నప్పటికీ, ప్రసార ఛార్జీల్లో నెలనెలా భారీ మార్పులు చోటుచేసుకోవడం రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపుతోందని వివరించారు. తెలంగాణకు కేటాయించిన 5,801 మెగావాట్ల నెట్‌వర్క్ యాక్సెస్‌లో ఎలాంటి మార్పు లేకపోయినా 2025 అక్టోబర్‌లో రూ.195 కోట్లు, నవంబర్‌లో రూ.145 కోట్ల మేర ప్రసార ఛార్జీలు విధించారని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఛార్జీల లెక్కింపును ప్రతి నెలా వెల్లడించాలని, మెగావాట్ ప్రాతిపదికన వార్షిక ఛార్జీలు నిర్ణయించి ఏడాదికి ఒకసారి మాత్రమే సర్దుబాటు చేసే విధానం తీసుకురావాలని కోరారు. ఇప్పటికే చెల్లించిన బిల్లులను తిరిగి పరిశీలించి అదనపు ఛార్జీలు విధించే విధానానికి స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు.
దక్షిణ భారతదేశానికి విద్యుత్ సరఫరా చేసే కీలక ప్రసార వ్యవస్థలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. రాయ్‌గఢ్–పుగళూర్–త్రిస్సూర్ హెచ్‌వీడీసీ విద్యుత్ ప్రసార వ్యవస్థ ద్వారా దక్షిణాదికి సుమారు 6,000 మెగావాట్ల విద్యుత్ అందుతోందని, దీనికి పూర్తిస్థాయి జాతీయ హోదా కల్పించాలని సూచించారు. తెలంగాణ విద్యుత్ ప్రసార ప్రణాళికలో భాగంగా 23,480 ఎంవీఏ సామర్థ్యం కలిగిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులకు తొలి విడతలోనే ఆమోదం ఇవ్వాలని కోరారు. కర్ణాటకలోని సేడం నుంచి తెలంగాణలోని పరిగి వరకు నిర్మించనున్న 400 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్, 765/400 కేవీ మహేశ్వరం–2 సబ్‌స్టేషన్ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర ప్రసార ప్రాజెక్టులుగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వీటి నిర్మాణ వ్యయాన్ని జాతీయ స్థాయిలో పంచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల మినహాయింపు గడువును కూడా పొడిగించాలని భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. ప్రస్తుత మినహాయింపు 2028 జూన్ 30తో ముగియనుండగా, ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు 2029 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ఆమోదించిన విద్యుత్ వనరుల సమృద్ధి ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు సమకూర్చుకునే విద్యుత్ సామర్థ్యానికి 2030 మార్చి 31 వరకు ప్రసార ఛార్జీల మినహాయింపు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావంతో 2026 సెప్టెంబర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే సుమారు 20 శాతం తగ్గిందని, అదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 13.3 శాతం పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ నిల్వ వ్యవస్థలతో కూడిన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు.
రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క కోరారు. 2027 ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దేశంలోని అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులో ఉంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. విద్యుత్ చట్టం–2003లోని సెక్షన్ 11 ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖతో సమన్వయం చేసుకుని ముందుగానే గ్యాస్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని ఏ ఒక్క రాష్ట్రంపైనా భారం వేయకుండా ఉమ్మడి విధానం ద్వారా భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ప్రసార వ్యవస్థల విస్తరణ, పంపిణీ నష్టాల తగ్గింపు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, ఆర్థిక సహాయం, విధానపరమైన మద్దతు అందించాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరారు.



























