[t4b-ticker]

కొల్తూరు పెద్ద చెరువులో చేప పిల్లల మృత్యువాత

ప్రతిపక్షం, ఆగస్టు 20, శామీర్ పేట: మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు పెద్ద చెరువులో భారీగా చేప పిల్లలు మృతి చెందాయి. చెరువు నీరు కలుషితం కావడం వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని స్థానిక మత్స్యకారులు, ఆరోపిస్తున్నారు. చెరువుకు సమీపంలోని ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల కారణంగానే నీరు కలుషితమైందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చేప పిల్లల మృతితో మత్స్యకారులకు సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. చేపల పెంపకమే జీవనాధారంగా చేసుకున్న తమ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫార్మా కంపెనీల రసాయన వ్యర్థాలపై గత ఏడాదే కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం భారీ నష్టం జరిగిందని మత్స్యకారులు మండిపడ్డారు.

చెరువు నీటిని తక్షణమే శాస్త్రీయంగా పరీక్షించి చేపల మృతికి అసలు కారణాలను వెలికితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రసాయన వ్యర్థాలను విడుదల చేస్తున్నట్లు తేలితే సంబంధిత ఫార్మా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి చెరువు నీటి నాణ్యతను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు మత్స్యకారులను ఆదుకోవాలని కొల్తూరు గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News