ప్రతిపక్షం, నవంబర్ 26: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన వారసత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచిన రాజ్యాంగం కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో అంతర్భాగమైందని తెలిపారు. నవంబర్ 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తోపాటు రాజ్యాంగ పరిషత్ సభ్యులందరికీ నివాళులర్పించారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగం నిరంతరం మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
రాజ్యాంగం అందించిన విలువలను మరింత బలోపేతం చేసుకోవడానికి, దాని రూపకర్తల సేవలను స్మరించుకోవడానికి రాజ్యాంగ దినోత్సవం ఒక మంచి అవకాశమని మోదీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అసాధారణమైనదని, సామాన్య కుటుంబంలో జన్మించిన తనలాంటి వ్యక్తికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించే అవకాశం కల్పించిందని వివరించారు. చిన్నతనంలో ఎదుర్కొన్న పేదరికం, సాధారణ కుటుంబ పరిస్థితులు, జీవితంలో ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకుంటే రాజ్యాంగం పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుందని తన వ్యాసంలో పేర్కొన్నారు. ఎలాంటి ప్రత్యేక హక్కులు, కుటుంబ నేపథ్య ప్రయోజనాలు లేని వ్యక్తి దేశానికి సేవ చేసే అత్యున్నత బాధ్యతను చేపట్టగలగడం రాజ్యాంగ గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.
భిన్న మతాలు, భాషలు, సంప్రదాయాలు, ఆలోచనా విధానాలు కలిగిన భారతదేశంలో రాజ్యాంగం కేవలం పార్లమెంటు, న్యాయస్థానాలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడి జీవితంలో భాగం కావాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతలో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల సామూహిక చైతన్యంలో రాజ్యాంగ విలువలకు మరింత ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. రాజ్యాంగ రూపకల్పనలో భారతదేశ నాగరికతా సంపద, సంప్రదాయాల నుంచి కూడా విస్తృతంగా స్ఫూర్తి పొందారని గుర్తుచేశారు.
రాజ్యాంగం సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో రూపొందిన గొప్ప పత్రం అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదికను ప్రస్తావిస్తూ, దాదాపు 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని తన వ్యాసంలో తెలిపారు. తరతరాలుగా పేదరికంలో జీవించిన కుటుంబాలు ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరినప్పుడే రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం మరింత బలోపేతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో గత కాంగ్రెస్ పాలనపై ప్రధాని విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన వారే గతంలో దాన్ని బలహీనపరిచారని ఆరోపించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్యలు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. 1951లో చేపట్టిన తొలి రాజ్యాంగ సవరణకు ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తవుతున్నాయని గుర్తుచేశారు. తొలి సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రజలచే నేరుగా ఎన్నిక కాని ప్రభుత్వం తాత్కాలిక పార్లమెంటులో తన మెజారిటీని ఉపయోగించి ప్రాథమిక స్వేచ్ఛలపై పరిమితులు విధించిందని విమర్శించారు.
అత్యవసర పరిస్థితుల సమయంలో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణను కూడా మోదీ ప్రస్తావించారు. ఈ సవరణ ద్వారా న్యాయ సమీక్ష అధికారాలను కుదించి, వివిధ వ్యవస్థల మధ్య ఉన్న అధికార సమతౌల్యాన్ని మార్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అధికార దాహంతో వ్యవహరించే నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలదో తెలుసుకోవాలంటే 38, 39వ రాజ్యాంగ సవరణలను యువత అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ పరిమితులు, సంస్థల స్వతంత్రత ఎంత ముఖ్యమో ఈ పరిణామాలు తెలియజేస్తాయని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370, 35ఏ నిబంధనలపైనా ప్రధాని తన వ్యాసంలో ప్రస్తావించారు. ఈ నిబంధనల కారణంగా ఏడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్‌లో భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలతోపాటు మహిళల హక్కులకు కూడా విఘాతం కలిగిందని ఆరోపించారు. 2019లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయడం ద్వారా చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దామని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించేందుకు దేశం కీలక దశలో ఉందని, ఈ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశ భవిష్యత్తు కోసం రెండు సూత్రాలు మార్గదర్శకంగా ఉండాలని మోదీ సూచించారు. ఆలోచనల్లో ‘ఇండియా ఫస్ట్’ అంటే భారత్ ప్రథమం అనే భావన, కార్యాచరణలో ‘కర్తవ్య’ అంటే బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ రెండు సూత్రాలను పాటిస్తూ రాజ్యాంగ విలువలను బలోపేతం చేస్తే భవిష్యత్ తరాలకు ఉజ్వలమైన దేశాన్ని అందించగలమని తన వ్యాసంలో వివరించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తోపాటు రాజ్యాంగ రచనలో భాగస్వాములైన రాజ్యాంగ పరిషత్ సభ్యులందరికీ నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు రాజ్యాంగం బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలతో గౌరవప్రదంగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే దానికి పునాదిగా సామాజిక ప్రజాస్వామ్యం ఉండాలని డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, అంబేడ్కర్ తదితర నాయకులు ఆధునిక భారత నిర్మాణానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, సామ్యవాదం వంటి రాజ్యాంగ మౌలిక విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించింది. అయితే 1950 జనవరి 26 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఈ రోజునే దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగం ‘భారత ప్రజలమైన మేము’ అనే పదాలతో ప్రారంభమై దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా రాజ్యాంగ నిర్మాతల సేవలను గుర్తుచేసుకోవడంతోపాటు, అందులో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలనే సంకల్పాన్ని నాయకులు పునరుద్ఘాటించారు.



























