ప్రతిపక్షం, ఆగస్టు 07: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలులో ఉన్న రిజర్వేషన్లకు క్రీమిలేయర్ విధానం వర్తించదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం, ఎస్సీ, ఎస్టీలకు కూడా క్రీమిలేయర్ నిబంధనలను వర్తింపజేయాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించాలని కోరింది.
కేంద్రం తన అఫిడవిట్‌లో, ప్రస్తుతం క్రీమిలేయర్ విధానం కేవలం ఇతర వెనుకబడిన వర్గాల (OBC) రిజర్వేషన్లకే వర్తిస్తోందని పేర్కొంది. ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కుటుంబాలకు చెందిన వ్యక్తులను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి మినహాయించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించింది.
అయితే ఇదే విధానాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాలపై కూడా అమలు చేయాలన్న డిమాండ్‌కు కేంద్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులు, ఆయా వర్గాల సామాజిక పరిస్థితులు ఓబీసీలతో భిన్నంగా ఉన్నందున క్రీమిలేయర్ సూత్రాన్ని ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేయడం సమంజసం కాదని కేంద్రం తన వాదనలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై క్రీమిలేయర్ అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

















