[t4b-ticker]

EMI బకాయి ఉంటే ఫోన్ లాక్.. 2027 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి

ప్రతిపక్షం, ఆగస్టు 07: రుణం (EMI)పై మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసే వినియోగదారులకు కీలక మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం, 2027 జనవరి 1 నుంచి ఈఎంఐలు చెల్లించడంలో దీర్ఘకాలిక బకాయిలు ఉంటే ఫైనాన్స్ సంస్థలు సంబంధిత డివైజ్‌లను దశలవారీగా లాక్ చేసే అవకాశం ఉంటుంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒక ఈఎంఐ బకాయి పడి 30 రోజులు పూర్తయితే డివైజ్‌ను పాక్షికంగా (Partial Lock) పరిమితం చేయవచ్చు. 60 రోజుల పాటు బకాయి కొనసాగితే పూర్తిగా (Full Lock) లాక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వినియోగదారుల భద్రత, అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, అత్యవసర కమ్యూనికేషన్ సేవలు, ఉపాధి లేదా ఉద్యోగానికి అవసరమైన కొన్ని కీలక ఫీచర్లు మాత్రం అందుబాటులో ఉండేలా నిబంధనలు రూపొందించారు.

అలాగే, ఈ ప్రక్రియలో ఫైనాన్స్ సంస్థలు లేదా రుణదాతలకు వినియోగదారుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసే హక్కు ఉండదని స్పష్టం చేశారు. డివైజ్‌లోని ఫొటోలు, వ్యక్తిగత ఫైళ్లు, కాంటాక్టులు, సందేశాలు వంటి డేటా గోప్యతకు ఎలాంటి భంగం కలగదని పేర్కొన్నారు.

ఈ నిబంధనల ఉద్దేశం రుణాల వసూళ్లను క్రమబద్ధీకరించడంతో పాటు వినియోగదారుల హక్కులు, డేటా భద్రతను కూడా పరిరక్షించడం అని అధికారులు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News