ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 19: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. మండల కేంద్ర సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్, యువ నాయకుడు సాయి చరణ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
చిగురుమామిడి అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరాను: సర్పంచ్ భవాని శివప్రసాద్
చిగురుమామిడి మండల కేంద్ర సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చిగురుమామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. రాబోయే రోజుల్లో మంత్రి సహకారంతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
హుస్నాబాద్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొన్నం ప్రభాకర్
సర్పంచ్ భవాని శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు చిగురుమామిడి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.చిగురుమామిడి మండల కేంద్రానికి మోడల్ స్కూల్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. కరీంనగర్–హుస్నాబాద్ ఫోర్‌లేన్ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.





























