సామాజిక తాత్త్వికత నుంచి పురుడు పోసుకున్న ‘అదనపు కణజాలం’
కందుకూరి అంజయ్య కవిత్వంలో ఆధిపత్య ప్రతిఘటన, ఉపసమూహాల ఉద్యమవాదం
‘అదనపు కణజాలం’ పుస్తకావిష్కరణలో ఆచార్య జయధీర్ తిరుమలరావు ముఖ చలనచిత్ర విమర్శకుడు డా. పొన్నం రవిచంద్రకు ‘అదనపు కణజాలం’ అంకితం
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, అక్టోబర్ 2: సాంస్కృతిక పునాదులు, సామాజిక తాత్త్వికత నుంచి కందుకూరి అంజయ్య కవిత్వ సంపుటి ‘అదనపు కణజాలం’ పురుడు పోసుకుందని ప్రముఖ జానపద సాహిత్య పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు అన్నారు. ఉపరితల అంశాలను మాత్రమే స్పృశిస్తూ రాసే కవిత్వం కాలగర్భంలో నిలిచిపోదని, సాంస్కృతిక మూలాలను లోతుగా అర్థం చేసుకుని సృజన చేసే రచయితలే సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ, కరీంనగర్ ఫిలిం సొసైటీ, అంబేద్కర్–ఫూలే–పెరియర్ అధ్యయన వేదికల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్‌లోని క.ఫి.సో. భవన్‌లో ‘అదనపు కణజాలం’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆచార్య జయధీర్ తిరుమలరావు పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా కందుకూరి అంజయ్య ‘అదనపు కణజాలం’ కవితా సంపుటిని ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు డా. పొన్నం రవిచంద్రకు అంకితం చేశారు.
మూల సంస్కృతిని విస్మరించొద్దు
పుట్టు దైవాలను విస్మరించి పెట్టు దైవాలతో ఊరేగడం సరికాదని జయధీర్ తిరుమలరావు అన్నారు. మావురాల ఎల్లమ్మ, కొమురెల్లి మల్లన్న, ముత్యాలమ్మ, గంగానమ్మ వంటి జానపద దేవతలను మరచిపోవడం మూలవాసి సంస్కృతికి నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. సమాజపు సాంస్కృతిక మూలాలను గుర్తించి వాటి నుంచి సాహిత్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ‘అదనపు కణజాలం’ కవిత్వంలో ఆధిపత్య ప్రతిఘాతవాదం, ఉపసమూహాల ఉద్యమవాదం ప్రధానంగా కనిపిస్తున్నాయని పుస్తక సమీక్షకుడు కూకట్ల తిరుపతి పేర్కొన్నారు. సమాజంలోని వివిధ వర్గాల అనుభవాలు, సంఘర్షణలు, అస్తిత్వ ప్రశ్నలను కవి తన కవిత్వంలో ప్రతిబింబించారని వివరించారు.
కృతిస్వీకర్త, ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ కోటిలింగాల తవ్వకాల్లో వెలుగుచూసిన చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. చారిత్రక, సాంస్కృతిక సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ పుస్తకాన్ని డా. పొన్నం రవిచంద్రకు అంకితం చేశారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు సి.వి.కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కొండి మల్లారెడ్డి, బూర్ల వెంకటేశ్వర్లు, తోట నిర్మలారాణి, పండుగ రత్నయ్య తదితరులు ప్రసంగించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దామరకుంట శంకరయ్య, సమన్వయకర్త పెనుగొండ బసవేశ్వర్ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.
డా. నలిమెల భాస్కర్, డా. మచ్చ హరిదాసు, జూకంటి జగన్నాథం, దేవి యాదగిరి, అన్నవరం దేవేందర్, పి.ఎస్. రవీంద్ర, ఎర్రోజు వెంకటేశ్వర్లు, మహమూద్ పాషా, మాడిశెట్టి గోపాల్, కె.ఎస్. అనంతాచార్య, మహమ్మద్ నసీరుద్దీన్, సంకేపల్లి నాగేంద్రశర్మ, గుండు రమణయ్య, బాలసాని కొమురయ్య, తడిగొప్పుల కుమారస్వామి, కనకం శ్రీనివాస్, నెరువట్ల చైతన్య, సదాశ్రీ, విలాసాగరం రవీందర్, కందుకూరి సహచరి సుహాసిని, ఆదిత్య, అక్షయ్, సమీక్ష, అవ్యాన్‌తో పాటు బంధువులు, సాహితీ మిత్రులు పాల్గొన్నారు.






























