మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఇద్దరు యువకులు దుర్మరణం
హనుమకొండ రహదారిపై విషాదం
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదం.. మరొకరి పరిస్థితి విషమం
ప్రతిపక్షం , హుస్నాబాద్: అక్టోబర్ 5: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై చెత్తను సేకరిస్తున్న మున్సిపాలిటీ ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు:
పట్టణంలోని హనుమకొండ రోడ్డు మార్గంలో చెత్తను సేకరిస్తూ నిలిపి ఉంచిన మున్సిపల్ ట్రాక్టర్‌ను ఒకే ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ప్రమాద ధాటికి బైక్‌పై ఉన్న నద్దునూరి శ్రీకాంత్, నరసింహలకు తీవ్ర గాయాలై, రోడ్డుపై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనంపై ఉన్న మూడో వ్యక్తి నద్దునూరి శ్రీను తీవ్రంగా గాయపడటంతో స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.































