*ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈవో,డిఈఓ
ప్రతిపక్షం ,వేములవాడ, నవంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర కార్తీక మాసం, పైగా ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయానికి విచ్చేసిన భక్తులు ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం, కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గండ దీపంలో నూనె పోయడంతో పాటు, కార్తీక మాస విశిష్టతను పురస్కరించుకుని ఆలయంలోని ఉసిరి చెట్టు కింద భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడితో కిటకిటలాడింది.తదుపరి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శన అనంతరం భక్తులు అన్నప్రసాద సత్రానికి చేరుకుని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
కార్తీక మాసం రద్దీ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి , డీఈవో ప్రతాప నవీన్ కుమార్ ఎప్పటికప్పుడు క్యూలైన్లు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఏఈవోలు , సూపరింటెండెంట్లు, ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొని భక్తులకు సేవలు అందించారు.






























