[t4b-ticker]

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రాజీనామా చేయాలి: హరీశ్‌రావు

ప్రతిపక్షం, ఆగస్టు 18, హైదరాబాద్: 22ఏ భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 22ఏ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

లక్షలాది ఎకరాల భూములు, ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని హరీశ్‌రావు అన్నారు. గత 20 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా సృష్టించిందని విమర్శించారు. భూములపై ప్రజలు దరఖాస్తులు చేసుకునే అవసరం లేకుండా తప్పుగా చేర్చిన పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం చేసిన తప్పులను అధికారులు, ఉద్యోగులపైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు నిర్ణయాలు తీసుకుని వాటికి అధికారులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. 22ఏ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

అదే సమయంలో కబ్జా చేసిన భూములను 22ఏ పేరుతో క్రమబద్ధీకరించుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హరీశ్‌రావు హెచ్చరించారు. నిజమైన భూ యజమానులకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ భూములను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

22ఏ జాబితాలో పొరపాటుగా చేర్చిన భూములు, ఇళ్లను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా పారదర్శకంగా భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. 22ఏ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Spread the love

Related News

Latest News