[t4b-ticker]

కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 16: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పరిశీలకులుగా హాజరైన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బీఎల్‌ఏల పనితీరు, నామినేటెడ్ పదవుల భర్తీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు తదితరులు సమావేశంలో పాల్గొని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వివరించారు.

ఎస్‌ఐఆర్, ఓటర్ మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సచిన్ సావంత్ కీలక సూచనలు చేశారు. ఇప్పటివరకు స్వీకరించని ఎన్్యూమరేషన్ ఫారాలను పార్టీ శ్రేణులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సేకరించాలని సూచించారు. తొలగించిన ఓట్లు, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేయని బీఎల్‌ఏలను గుర్తించి వారి స్థానంలో చురుకైన వారిని నియమించాలని సూచించిన సచిన్ సావంత్.. ఎస్‌ఐఆర్ 100 శాతం పూర్తయిందంటూ వాస్తవానికి విరుద్ధమైన సమాచారం ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గాల బాధ్యులు ప్రతి 15 రోజులకు ఒకసారి బీఎల్‌ఏలతో సమీక్ష నిర్వహించాలని సూచించారు.

హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, సుమారు 28,025 ఓట్లు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు ఎస్‌ఐఆర్‌కు నోచుకోలేదని నేతలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
మండల కమిటీల ఏర్పాటుకు గడువు జిల్లాలోని అన్ని మండల, టౌన్ కాంగ్రెస్ కమిటీలను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు.మండల కాంగ్రెస్ అధ్యక్షులను టీపీసీసీ కనెక్ట్ సెంటర్‌కు అనుసంధానం చేసి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఆదేశాలను నేరుగా వారికి చేరేలా చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం తెలిపారు. మండల స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల నివేదికలను కనెక్ట్ సెంటర్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా పార్టీకి క్షేత్రస్థాయి సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

నామినేటెడ్ పదవులు వెంటనే భర్తీ చేయాలి.

హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందని, ఇటీవల మున్సిపల్ చైర్మన్ స్థానంతో పాటు మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని ఒడితెల ప్రణవ్ బాబు వివరించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి త్వరగా పదవులు కల్పించాలని కోరారు.మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు అందలేదని అన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరిగేలా నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని కోరారు.దీనిపై స్పందించిన సచిన్ సావంత్.. ఏయే పదవులు భర్తీ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, సామాజిక-రాజకీయ సమీకరణాలు, పార్టీకి కలిగే ప్రయోజనం వంటి అంశాలతో స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

సంక్షేమ పథకాలపై గ్రామస్థాయి ప్రచారం
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేయాలని సచిన్ సావంత్ సూచించారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి తదితర పథకాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.ప్రతి గ్రామంలో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలను భాగస్వాములను చేసే వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యం కారణంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై కొంత ప్రభావం పడుతోందని ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ సమావేశంలో పేర్కొన్నారు.

ఎస్సీ సంక్షేమం, కార్పొరేషన్ రుణాలపై చర్యలు
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ రుణాల అంశాన్ని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన వారికి రుణాలు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. దళిత సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

సోషల్ మీడియా బలోపేతానికి చర్యలు
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.ప్రతి గ్రామం, వార్డులో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు. సోషల్ మీడియా కార్యకలాపాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కన్వీనర్‌ను నియమించాలని నిర్ణయించారు.
ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నాయక్ మాట్లాడుతూ బీజేపీ హిందుత్వ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాల్ రైటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.దీనికి ప్రతిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన నియోజకవర్గంలో “జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్” నినాదంతో వాల్ రైటింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా, ఫీల్డ్ క్యాడర్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సచిన్ సావంత్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.సమావేశంలో ఉట్కూరు నరేందర్ రెడ్డి, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, మడుపు మోహన్, ముత్యం శంకర్ గౌడ్ తదితరులతో పాటు చొప్పదండి, హుజురాబాద్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News