ప్రతిపక్షం, ఆగస్టు 08: ఏపీలోని విజయవాడలో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాననే బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘నాన్నా.. చదవమని ఎప్పుడూ చెబుతుంటావు. కానీ నాకు చదవడం రావడం లేదు. అందుకే చనిపోతున్నా’ అంటూ ఓ పుస్తకంలో రాసినట్లు సమాచారం.
బాలుడి తల్లి ఇప్పటికే మృతి చెందడంతో తండ్రి దుర్గా ప్రసాద్ అతడిని అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. అయితే నిన్న పాఠశాలకు వెళ్లే సమయంలో గేట్లు మూసివేయడంతో బాలుడు తిరిగి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం తండ్రి ఇంటికి చేరుకునేసరికి బాలుడు ఉరివేసుకుని కనిపించాడు. ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

















