- ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం -మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 03: బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం దేశ రాజకీయాల్లో కీలక పరిణామమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సొంత నియోజకవర్గంగా పేరొందిన బంకిపూర్‌లో, బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఓటమిపాలవడం ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమన్నారు. దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకిపూర్‌లో భారీ మెజారిటీతో జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారని, ప్రజలు తమ తీర్పుతో బీజేపీ అహంకారానికి గట్టి సమాధానం చెప్పారని పేర్కొన్నారు.దేశంలో తమకు ఎదురే లేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని విర్రవీగుతున్న బీజేపీకి బంకిపూర్ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా గుణపాఠం చెప్పారు. అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రచార ఆర్భాటం ఎంత ఉన్నా ప్రజల తీర్పును ఎవరూ మార్చలేరని ఈ ఎన్నిక మరోసారి నిరూపించింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.బీజేపీకి పునాదులే కదిలిపోతున్నాయనే సంకేతాలను బంకిపూర్ ఉపఎన్నిక ఫలితం స్పష్టంగా వెల్లడించిందన్నారు. ప్రజల సమస్యలను విస్మరించి, అహంకారపూరిత పాలన కొనసాగిస్తే ప్రజలు సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా నిలిచిందన్నారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమవుతోందనే భావన ప్రజల్లో బలపడుతోందని తెలిపారు. బంకిపూర్‌లో వచ్చిన తీర్పు కేవలం ఒక నియోజకవర్గ ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ప్రజల సంకల్పానికి ప్రతీక అని మంత్రి అన్నారు. ప్రజల గొంతుకను అణచివేయాలని ప్రయత్నించే రాజకీయాలకు దేశ ప్రజలు తగిన సమయంలో సరైన సమాధానం చెబుతారనిపేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజల తీర్పే అంతిమం. బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలవడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం. ఇదే ప్రజా చైతన్యం రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో మరింత పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

















