ప్రతిపక్షం, జూలై 31: రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను వెంటనే గుర్తించి ప్రక్రియను పూర్తి చేసి, ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని సూచించారు. ఈ పింఛన్లు బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవనభారాన్ని కొంతవరకు తగ్గిస్తాయని సీఎం పేర్కొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులు వంటి అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే దివ్యాంగులు మరణించిన వెంటనే వారి భార్యలకు ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గ్రామీణాభివృద్ధికి సంబంధించి మండల స్థాయిలో చేపట్టే అన్ని శాఖల అభివృద్ధి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం సూచించారు. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించి, వాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని తెలిపారు. ఈ సమావేశాల ద్వారా సర్పంచులు గ్రామ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒక్క గ్రామం కూడా తారు రహదారి లేకుండా ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మించడంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి సొంత కార్యాలయం నిర్మించాలని ఆదేశించారు. గ్రామాల జనాభా ఆధారంగా పంచాయతీలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అవసరమైన భవనాలు నిర్మించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యం, గ్రామాభివృద్ధి పనులపై పూర్తి బాధ్యతతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివిధ కారణాలతో ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీల్లో కూడా పారిశుద్ధ్య పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు సేవల్లో ఎలాంటి అంతరాయం రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోటి మంది మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరలు నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన డిజైన్లతో ఉండాలని సీఎం ఆదేశించారు. చీరల రూపకల్పన కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన లభించినందున నాణ్యత, రంగులు, డిజైన్ల విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు సూచించారు.
ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామీణ తాగునీటి శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం పెంచి తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక వనరులను సమర్థంగా వినియోగిస్తూ నీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
గ్రామీణ తాగునీటి పథకాల కింద పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెల ఐదో తేదీలోపు వేతనాలు తప్పనిసరిగా చెల్లించాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు మెరుగైన గ్రామీణ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల సమర్థ అమలు, తాగునీటి భద్రత, సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


















