సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి
మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 05: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ప్రజలు డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, సూచించారు. జాతీయ ‘సైబర్ జాగృత్ దివస్’ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు.తెలంగాణలో ప్రతిరోజూ సైబర్ నేరాల కారణంగా కోట్ల రూపాయలను ప్రజలు నష్టపోతున్నారని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి ప్రకటనలను చూసి మోసపోవద్దని సూచించారు. మోసగాళ్లు ముందుగా వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి, కొందరు వ్యక్తులు భారీగా లాభాలు పొందినట్లు నకిలీ స్క్రీన్‌షాట్లు, సందేశాలను షేర్ చేస్తారని చెప్పారు.
వాటిని నమ్మి పెట్టుబడులు పెడితే తొలుత కొద్దిమొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించి, అనంతరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించిన తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వివిధ రకాల ఫీజుల పేరుతో డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఒకసారి డబ్బులు చెల్లించిన తర్వాత మరో ఫీజు, ఇంకో ఫీజు అంటూ వరుసగా డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు. చివరకు భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయిన తర్వాతే మోసపోయిన విషయం బాధితులకు తెలుస్తుందన్నారు. ఉద్యోగం ఇచ్చే సంస్థ అభ్యర్థికి జీతం చెల్లిస్తుంది కానీ, ఉద్యోగం ఇచ్చేందుకు అభ్యర్థి నుంచి డబ్బులు ఎందుకు అడుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఏటీఎం/డెబిట్ కార్డు వివరాలు వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని ఎస్పీ సూచించారు.విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరుడిగా వ్యవహరించినప్పుడే ‘సైబర్ స్వతంత్ర తెలంగాణ’ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చివరగా విద్యార్థులతో సైబర్ అవగాహనా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్, డీఎస్పీలు సుభాష్ చంద్రబోస్, ప్రసన్నకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. హుస్సేన్, డా.టి. మల్లేశం, వి. మురళి, డాక్టర్ ఆర్. శ్రీలత, సైబర్ క్రైమ్ సిబ్బంది సతీష్, సయ్యద్, సాయికిరణ్, స్వప్న, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.




















