[t4b-ticker]

ఎల్ నినో ప్రభావం సిర్దేపల్లి రైతు వేదికలో – పంటల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం

*ఎల్ నినో ప్రభావం అప్రమత్తంగా ఉండండి – వరి నాట్లు విరమించి ప్రత్యామ్నాయ పంటలు వేయండి.

*చండూరు మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ .

ప్రతి పక్షం చండూరు ఆగస్టు 18: సిర్దేపల్లి గ్రామంలోని రైతు వేదికలో ఈరోజు రైతులకు *ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం పత్తి పంట ఐదాకుల దశలో ఉందని, రైతులు వెంటనే కలుపు తీసి, తగినంత తేమ ఉన్నప్పుడు అడుగు మందులు వేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం పత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉన్నందున, ఎకరానికి ఫిప్రోనిల్ 400 గ్రాములు + 13:0:45 – 1 కిలో + అగ్రోమిన్ మాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలని సలహా ఇచ్చారు. పత్తి పంట బెట్టకు గురైతే 2% యూరియా ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలని తెలిపారు.ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున, బోర్ల కింద వరి సాగు చేసే రైతులు వరి నాట్లు విరమించుకోవాలని సూచించారు.బదులుగా మిగిలిన పొలంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు మరియు చిరుధాన్యాల సాగు చేపట్టాలని సలహా ఇచ్చారు. దీనివల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు మంచి ఆదాయం వస్తుందని వివరించారు.


“ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా పంటలను ఎంపిక చేసుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదించాలి” అని మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో AEO పద్మజ, సర్పంచ్ దామెర రాములు, గణపతి, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి తదితర రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News