ప్రతిపక్షం, ఆగస్టు 19: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారని రేవంత్‌రెడ్డి ఎలా ప్రకటిస్తారని సుస్మిత ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలో అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఎలా ఉంటుందని నిలదీశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
అంతేకాకుండా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైనా సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎంకు ఒకవైపు పొంగు ఉందని, అయితే అది ఎక్కువ కాలం కొనసాగదని వ్యాఖ్యానించారు.
పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని సుస్మిత స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి భిన్నంగా పోటీ చేయాల్సి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
సుస్మిత వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ వేడిని పెంచాయి. పరకాల టికెట్ అంశం ఇప్పటికే చర్చనీయాంశంగా ఉండగా.. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత సమీకరణాలపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే సుస్మిత ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.





























