ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.. ఫిర్యాదులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు
శామీర్ పేట ప్రతి పక్షం: మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని తుంకుంట అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుంకుంట జీహెచ్ఎంసీ పరిధిలో గల్లీకో భారీ బహుళ అంతస్తుల నిర్మాణం, సెల్లార్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇటీవల కాలంలో అనుమతులకు విరుద్ధంగా సెల్లార్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోందని వారు పేర్కొంటున్నారు. నిర్మాణాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
ఫిర్యాదులు చేసినా స్పందన లేదంటూ ఆరోపణలు…
తుంకుంట వార్డు కార్యాలయం పరిధిలో అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత సిబ్బంది స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్
తుంకుంట జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న సెల్లార్, బహుళ అంతస్తుల నిర్మాణాలపై విచారణ జరిపి, అనుమతులు నిర్మాణ నిబంధనలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత నిర్మాణదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
వివరణ కోసం ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని టౌన్ ప్లానింగ్ అధికారి
తుంకుంట లో జరుగుతున్న భారీ బహులంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు వాట్సప్ ద్వారా ఫోటోలు పంపిస్తే చూసింది తప్ప వివరణ ఇవ్వడం లేదు.































