భద్రత నుంచి ప్రోటోకాల్ వరకు సమగ్ర ఏర్పాట్లు
అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు.
కలెక్టర్ చిత్రా మిశ్రా
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 29: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రేపు కరీంనగర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నందున భద్రత, ప్రోటోకాల్, ట్రాఫిక్, పార్కింగ్, ఇతర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.మంగళవారం సాయంత్రం కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సీఎం భద్రతా అధికారులతో కలిసి నూతన కలెక్టరేట్ భవనంలోని ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశ మందిరం, కలెక్టర్ ఛాంబర్, అదనపు కలెక్టర్ ఛాంబర్‌తో పాటు సీఎం పర్యటనలో వినియోగించే ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా చిన్నపాటి లోపానికి కూడా అవకాశం లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.సీఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, విద్యుత్, పరిశుభ్రత, ప్రోటోకాల్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాలు సజావుగా జరిగేలా ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, వివిధ శాఖల అధికారులు, సీఎం భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.





























