యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం!
పదేళ్ల ప్రగతి ప్రస్థానానికి 10కే రన్‌తో శ్రీకారం
సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబర్ 9: మూడు దశాబ్దాల కల సాకారం అయి దశాబ్దం అవుతోంది. పదేళ్లలో ప్రగతి పరుగులు పెట్టింది. ఇక విశ్వవిద్యాలయ ఏర్పాటే లక్ష్యం. సిద్ధిపేట అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక అడుగు వేయాలని, విద్యా రంగంలోనూ విశ్వ విఖ్యాతి సాధించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు ఆకాంక్షించారు. జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలను ప్రకటించారు. విశ్వవిద్యాలయాన్ని సిద్ధిపేటలో ఏర్పాటు చేయడమే తన తదుపరి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 10కే పరుగును శుక్రవారం ఉదయం ప్రారంభించిన ఆయన.. నేటి పరుగు రేపటి పది రెట్ల అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.సకల రంగాల్లో అభివృద్ధి సాధించి విశ్వ ఖ్యాతి పొందిన సిద్ధిపేటను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికే విద్యా కేంద్రంగా ఎదిగిన సిద్ధిపేటలో త్వరలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే తదుపరి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఘనంగా ప్రారంభమైన దశాబ్ది ఉత్సవాలు
సిద్ధిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 10కే పరుగును హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. యువతీ యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు, పట్టణ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హరీశ్ రావు కూడా ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఏర్పాటు ప్రజల దశాబ్దాల కల అని గుర్తుచేశారు. 30–40 ఏళ్లుగా ఎన్నికల సమయంలో జిల్లా ఏర్పాటు హామీ వినిపించేదని చెప్పారు. గోడలపై రాతలు, కరపత్రాల్లో జిల్లా ఏర్పాటు నినాదాలు కనిపించేవని తెలిపారు. ఆ కల 2016 అక్టోబర్ 11వ తేదీన సాకారమైందని అన్నారు. జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
కేసీఆర్ సంకల్పంతో జిల్లా ఏర్పాటు
సిద్ధిపేట జిల్లా ఏర్పాటు కోసం కేసీఆర్ 1983లోనే ప్రయత్నాలు మొదలు పెట్టారని హరీశ్ రావు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సిద్దిపేటకు వచ్చినప్పుడు అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారని గుర్తుచేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ అదే చేత్తో సంతకం చేసి సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 1983లో ప్రారంభమైన ఆకాంక్ష 2016లో నెరవేరిందని అన్నారు. తెలంగాణలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి, వాటిని అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని హరీశ్ రావు అన్నారు.
జిల్లా ఏర్పాటుతో మారిన రూపురేఖలు
జిల్లా ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత సిద్దిపేటలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని హరీశ్ రావు సూచించారు. జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కమిషనరేట్ సహా పలు ప్రభుత్వ విభాగాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ క్లబ్బులు పెరిగాయని వివరించారు.గతంలో ఉపాధ్యాయుల బదిలీలు, పోలీసు నియామక పరీక్షల కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు. తెల్లవారుజామున ప్రయాణాలు చేస్తూ అభ్యర్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడేవారని చెప్పారు. ప్రస్తుతం ఎంసెట్‌తో పాటు పలు పరీక్షలను సిద్ధిపేటలోనే రాసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. జిల్లా ఏర్పాటు వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయని పేర్కొన్నారు.
మూడు దశాబ్దాల కలలు సాకారం
సిద్దిపేట ప్రజలకు మూడు ప్రధాన ఆకాంక్షలు ఉండేవని హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా కావాలి, రైలు మార్గం రావాలి, గోదావరి జలాలు అందాలి అనేవి ప్రజల చిరకాల కోరికలని చెప్పారు. ఈ మూడు లక్ష్యాలు నేడు సాకారం అయ్యాయన్నారు.రంగనాయక సాగర్‌లో గోదావరి జలాలు కనిపిస్తున్నాయని చెప్పారు. సిద్ధిపేటకు రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.పరిపాలనా సౌకర్యాలు మెరుగు అయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పుడు కలలుగా ఉన్న పలు అభివృద్ధి పనులు నేడు ప్రజల కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు.
విద్యా కేంద్రంగా సిద్ధి
సిద్ధిపేట ఇప్పటికే విద్యా రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని హరీశ్ రావు తెలిపారు. మెడికల్, నర్సింగ్, ఫార్మసీ, పారామెడికల్ కళాశాలలు, పాలిటెక్నిక్ లతో పాటు మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, మేనేజ్‌మెంట్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.భవిష్యత్తులో సిద్దిపేటలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే తమ తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ అవుతుందన్నారు. ఆ దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రేపటి సిద్దిపేట కోసం సమష్టి కృషి
సిద్ధిపేట జిల్లా గత పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందిందని హరీశ్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా ఎలా ఉండాలో ప్రజలు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. కేవలం ఆకాంక్షలు కలిగి ఉండటమే కాకుండా, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఉదయాన్నే సూర్యుడు చీకటిని తొలగిస్తూ వెలుగులు నింపినట్లుగా, దశాబ్దాల కల అయిన సిద్దిపేట జిల్లా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. 10కే పరుగులో పాల్గొన్న వారిలో కనిపించిన ఉత్సాహం జిల్లా అభివృద్ధిలోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. నేటి పరుగు రేపటి సిద్ధిపేట మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు.సిద్ధిపేటను మరింత అభివృద్ధి చేసి, విద్యా, వైద్య, క్రీడా రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
































