కేపీహెచ్‌బీలో మహిళ అదృశ్యం

రూ.60 లక్షల అప్పుల విషయంలో దంపతుల మధ్య వివాదం.. ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య

కూకట్‌పల్లి, ప్రతిపక్షం , అక్టోబర్ 23: కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌ పరిధిలో ఓ మహిళ అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్‌ఐజీ 123, బాస్కెట్‌బాల్‌ గ్రౌండ్‌ సమీపంలో నివాసముంటున్న ధారపు రెడ్డి శ్యామల (39) మూడేళ్లుగా హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. హాస్టల్‌ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో గత నెల రోజులుగా ఆమెకు, భర్త దేవిరెడ్డి జలంధర్‌ రెడ్డికి మధ్య వివాదం కొనసాగుతోంది.ఈ క్రమంలో అక్టోబరు 18వ తేదీ రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో తమకు ఉన్న రూ.60 లక్షల అప్పులు ఎలా తీర్చాలనే విషయంపై చర్చ జరుగుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన శ్యామల ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆమెను వెంబడించి మాట్లాడేందుకు భర్త ప్రయత్నించగా, తన దగ్గరకు రావద్దని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు శ్యామల బ్యాగు, సెల్‌ఫోన్‌ ఇంట్లోనే కనిపించాయి. కోపంతో బయటకు వెళ్లి ఉంటారని, తిరిగి వస్తారని భావించిన ఆయన.. బంధువుల వద్ద ఆరా తీశారు. అయితే ఆమె వారి వద్దకు కూడా వెళ్లలేదని తెలిసింది. ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యమైన శ్యామల ఎత్తు సుమారు ఐదు అడుగులు. ఛాయ ముదురు గోధుమ రంగులో ఉంటుంది. చివరిసారిగా ఆకుపచ్చ టాప్‌, ఆకుపచ్చ లెగ్గింగ్స్‌ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తెలుగు మాట్లాడతారని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు వివరాల మేరకు దర్యాప్తు చేపట్టారు.

Spread the love

Related News

Latest News