మాధవ్ నగర్ ROBపై బీజేపీ నేతల బిక్షాటన కార్యక్రమంపై ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ అక్టోబర్ 28 : మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఇతర నాయకులు చేపట్టిన బిక్షాటన కార్యక్రమంపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తీవ్రంగా స్పందించారు. అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిజంగా బిక్షాటన చేయాలనుకుంటే తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇళ్ల ముందు లేదా పార్లమెంట్లో బిక్షాటన చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మాధవ్ నగర్ ఆర్ వో బీ నిర్మాణ వ్యయంలో 63 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 37 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్ వో బీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సైతం కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించకుండా, బీజేపీ నేతలు బిక్షాటన కార్యక్రమాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదన్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖ వివిధ రైల్వే గడ్డర్ పనుల పేరుతో అభ్యంతరాలు, కొర్రీలు పెడుతూ ఆర్ వో బీ నిర్మాణాన్ని దాదాపు ఎనిమిది నెలలపాటు అడ్డుకుందని భూపతి రెడ్డి ఆరోపించారు. నిర్మాణంలో జాప్యానికి కారణాలపై ఎంపీ అరవింద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అర్సపల్లి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న రైల్వే పనులు ఇప్పటికీ ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించాలని ప్రశ్నించారు.
విద్యార్థులను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరం
చదువుకోవాల్సిన విద్యార్థులను రాజకీయ కార్యక్రమాల్లోకి తీసుకొచ్చి, వారిని ముందు ఉంచి బీజేపీ నిర్వహించిన బిక్షాటన ధర్నాను పూర్తిగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా అనుమతులు, అభివృద్ధి పనుల విషయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బిక్షాటన చేయాలని భూపతి రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడకుండా ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల రాజకీయాలనే అనుసరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల సాధనలో కేంద్రాన్ని నిలదీయాలని హితవు పలికారు.





























