ప్రతిపక్షం, ఆగస్టు 14, రాజోలి: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన రావిచెట్టును నరికివేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, రావిచెట్టు చుట్టూ ఉన్న పురాతన రచ్చకట్టను ధ్వంసం చేసి స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసుకున్నారని తెలిపారు. అనంతరం చెట్టును తొలగించేందుకు అనుమతులు మంజూరు చేయాలని అటవీ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించి, ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయగా, అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి చెట్టును తొలగించేందుకు అనుమతుల ప్రక్రియను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
అయితే ఇటీవల మళ్లీ రావిచెట్టును నరికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకుని, చెట్టును కాపాడేందుకు ఐక్యంగా నిలిచారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, ఈ రావిచెట్టు గ్రామ చరిత్ర, సంస్కృతి, పర్యావరణానికి ప్రతీకగా నిలిచిందని, దాదాపు 80 ఏళ్లుగా గ్రామానికి నీడనిస్తూ అనేక తరాలకు ఉపయోగపడుతోందని తెలిపారు. ఇటువంటి విలువైన వృక్షాన్ని నరికివేస్తే పర్యావరణ సమతుల్యతకు, గ్రామ వారసత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రావిచెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నరికేందుకు అనుమతించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. చెట్టును శాశ్వతంగా రక్షించడంతో పాటు, ధ్వంసమైన రచ్చకట్టను పునర్నిర్మించి, ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు కోరారు.
































