[t4b-ticker]

కాంగ్రెస్‌లో కొత్త చర్చ.. ఎమ్మెల్యేల మీడియా సమావేశాల వెనుక ఎవరున్నారు?

ప్రతిపక్షం, ఆగస్టు 21: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుష్మిత వ్యవహారం నేపథ్యంలో రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించడంపై పార్టీలోనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ వరుస మీడియా సమావేశాల వెనుక ఎవరైనా పార్టీ స్థాయి నుంచి ఆదేశాలు ఉన్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇటీవల కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డితో పాటు కొండా సుష్మిత కూడా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. అయితే వీరంతా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయని పార్టీ నేతలు.. కొండా కుటుంబం వ్యవహారంలో మాత్రం ఎందుకు ఇంతగా స్పందిస్తున్నారనే ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.

కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశాలు నిర్వహించి తమ అభిప్రాయాలను చెప్పడం వెనుక పార్టీ నాయకత్వం సూచనలు ఉన్నాయా? లేక వ్యక్తిగతంగా వారు నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారంలో వరుసగా నేతలు స్పందించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో మరో కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ మీడియా సమావేశాలు ఏఐసీసీ ఆదేశాలతో జరుగుతున్నాయా? టీపీసీసీ సూచనలతో జరుగుతున్నాయా? లేక ముఖ్యమంత్రి సూచన మేరకు నేతలు మాట్లాడుతున్నారా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

కొండా సురేఖ విషయంలోనే ఎందుకు ఇంత రాజకీయ హడావుడి జరుగుతోందనే అంశంపైనా నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సుస్మిత వ్యాఖ్యలు, వాటిపై పార్టీ నేతల స్పందనలు, సురేఖ ఇచ్చిన వివరణతో కాంగ్రెస్‌లో పరిస్థితి వేడెక్కింది. తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా మాట్లాడటంతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే మీడియా ముందుకొచ్చిన నేతల వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలా? లేక పార్టీ వ్యూహంలో భాగమా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News