ప్రతిపక్షం, ఆగస్టు 21: తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం చేపట్టిన అమెరికా పర్యటన రద్దయింది. అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తొలుత యూకే, అమెరికా పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి కోరగా.. యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకే చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది.
అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి, విస్మయం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ బోస్టన్ పర్యటనకు వెళ్లకుండా లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రావాలని సీఎం నిర్ణయించుకున్నారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడం, యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, నైపుణ్యాలు, శిక్షణ అందించడమే అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
అమెరికా పర్యటన రద్దయినప్పటికీ అక్కడి విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే ప్రారంభమైన చర్చలను కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేసే ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్య సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా నగరాన్ని అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థలతో అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా ఎదిగిందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో పాటు ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి ప్రముఖ సంస్థలు నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. ఈ విద్యా సంస్థల వల్లే హైదరాబాద్‌లో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయని వివరించారు.
ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలతో హైదరాబాద్‌కు మరిన్ని భాగస్వామ్యాలు ఏర్పడితే విద్యార్థులకు స్వదేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్య, నైపుణ్యాలు, సర్టిఫికేషన్లు పొందే అవకాశం కలుగుతుందని సీఎం అన్నారు. సాధారణ భారతీయ విద్యార్థి హైదరాబాద్‌లోనే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, ఎంఐటీ, లండన్ బిజినెస్ స్కూల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల స్థాయి విద్యను పొందగలిగేలా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, షెడ్యూల్ ప్రకారం యూకే పర్యటనను సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించనున్నారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర ప్రముఖ విద్యా సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. తెలంగాణలో విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చలు జరపనున్నారు.
అలాగే యూకేలోని ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన సంస్థల ప్రతినిధులతోనూ సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణతో భాగస్వామ్యాలను ఖరారు చేయడం, యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందించడంపై చర్చలు జరపనున్నారు.
అమెరికా పర్యటనకు బ్రేక్ పడినప్పటికీ.. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు ఆగబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంతో పాటు విద్య, నైపుణ్యాలు, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి అవకాశాలను తెలంగాణకు తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.





























