[t4b-ticker]

విధి ఆట అంటే ఇదేనేమో..

ప్రతిపక్షం, ఆగస్టు 21: మరో నెల రోజుల్లో పుట్టబోయే బిడ్డను కళ్లారా చూసి మురిసిపోవాలనుకున్న ఆ తండ్రి.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పదేళ్లుగా సంతానం కోసం ఎదురుచూసిన దంపతులకు ఎట్టకేలకు శుభవార్త అందగా.. కుటుంబంలో ఆనందం నిండిన సమయంలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. భార్య ఎనిమిది నెలల గర్భిణిగా ఉండగా భర్త మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయవిదారక ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగింది.

బెల్లంపల్లి పట్టణంలోని స్టేషన్‌ రోడ్డు కాలనీకి చెందిన యడమనూరి కొమురయ్య పెద్ద కుమారుడు సురేష్‌ (39) సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి సురేష్ తన స్నేహితుడు గట్లె చిరంజీవితో కలిసి ద్విచక్ర వాహనంపై కన్నాల బస్తీ నుంచి బెల్లంపల్లి వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ రోడ్డు మలుపు వద్దకు చేరుకున్న సమయంలో రెబ్బెన వైపు నుంచి వచ్చిన బొలేరో వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సురేష్‌కు తల, నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై వెనుక కూర్చున్న చిరంజీవికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

సురేష్‌కు 2016లో సుష్మతో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి ఈ దంపతులు సంతానం కోసం ఎదురుచూశారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత సుష్మ గర్భం దాల్చడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. మరో నెల రోజుల్లో తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని మురిసిపోవాలని సురేష్, అతని కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. బిడ్డ పుట్టడానికి కొద్దిరోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పుట్టబోయే బిడ్డను ఒక్కసారి కూడా చూడకుండానే సురేష్ మృత్యువాత పడటంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన సంతోషాన్ని ఆస్వాదించకముందే కుటుంబ పెద్దను కోల్పోవడంతో స్థానికంగా కూడా విషాదం నెలకొంది.

ఒకవైపు భర్తను కోల్పోయిన బాధ.. మరోవైపు కళ్లముందే ఉన్న పుట్టబోయే బిడ్డ.. సుష్మ పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొనడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Spread the love

Related News

Latest News