స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో సర్పంచ్‌కు సమాచారం కరువు!

*ఆర్డీవోకు ఫిర్యాదు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి.

ప్రతి పక్షం చండూరు, అక్టోబర్ 01: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం గుండ్రపల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడంపై వివాదం నెలకొంది.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ఉజ్జిని ఉషా అనిల్ రావు గురువారం చండూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.గ్రామంలో ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక రాజకీయ నాయకులు, రేషన్ డీలర్‌తో కలిసి అధికారులు నిర్వహించారని, అయితే తనతో పాటు ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సర్పంచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శికి సైతం ఈ కార్యక్రమం గురించి తెలియదని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయాలని, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటించాలని సర్పంచ్ కోరారు.

కార్యక్రమానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు, మార్గదర్శకాలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత జీపీఓ, అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామపంచాయతీతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని, విచారణ వివరాలను లిఖితపూర్వకంగా అందించాలని ఆర్డీవోను కోరారు.తక్షణమే స్పందించిన చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి జీపీఓకు మెమో జారీ చేయాలని తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో చండూరు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, గుండ్రపల్లి సర్పంచ్ ఉజ్జిని ఉషా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, బీఆర్ఎస్ చండూరు మండల ఉపాధ్యక్షులు కూరపాటి సుదర్శన్, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, చండూరు మండలం యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు, చండూరు మాజీ కౌన్సిలర్ అనపర్తి శేఖర్, పడమటితాళ్ల సర్పంచ్ గాలెంక రాంబాబు, గుండ్రపల్లి ఉపసర్పంచ్ టేకుల వినోద్ రెడ్డి, వార్డు మెంబర్లు పెండ్యాల నిర్మల్ రావు, తీగల వెంకన్న, వడ్డమల్ల మధు, కాశమల్ల శ్రీనివాసరావు, కాశమల్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News