*చండూరు డివైడర్లలో మేకల పాలవుతున్న మొక్కలు.
*రక్షణ కంచెలు లేక వృధా అవుతున్న ప్రజాధనం
*పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
ప్రతి పక్షం చండూరు నవంబర్ 02: మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారి మధ్యలో అందం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం నాటిన మొక్కల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. అధికారులు ఎంతో ఆర్భాటంగా డివైడర్లలో మొక్కలైతే నాటారు కానీ, వాటి సంరక్షణను మాత్రం పూర్తిగా గాలికొదిలేశారు.కనీసం ట్రీ గార్డ్స్ (రక్షణ కంచెలు) ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపై తిరిగే మేకలు, పశువులు ఈ మొక్కలను యథేచ్ఛగా తినేస్తున్నాయి. నాటిన కొద్దిరోజులకే డివైడర్లలోని చాలా మొక్కలు మొండిలుగా మారిపోతున్నాయి. హరితహారం, పట్టణ ప్రగతి అంటూ నిధులు ఖర్చు చేస్తున్న అధికారులు, క్షేత్రస్థాయిలో వాటిని కాపాడటంలో ఘోరంగా విఫలమవుతున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లక్షలాది రూపాయల ప్రజాధనంతో మొక్కలు నాటడం, ఆ తర్వాత వాటిని పశువుల పాలేయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా చండూరు మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే డివైడర్లలో మిగిలివున్న మొక్కలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, అలాగే రోడ్లపై పశువులను వదిలేసే యజమానులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు మరియు పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.































