[t4b-ticker]

కొలంబియాను వణికించిన భూకంపం.. 132కి చేరిన మృతుల సంఖ్య

ప్రతిపక్షం, ఆగస్టు 11: కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా మృతుల సంఖ్య 132కి పెరిగింది. మరో 570 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూకంప ప్రభావం పలు ప్రాంతాల్లో తీవ్రంగా కనిపించింది. రిసరాల్డా ప్రావిన్స్‌లో అత్యధికంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలి నగరంలో భూకంప ధాటికి సుమారు 30 భవనాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. చోకో ప్రావిన్స్‌లోని శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతులో 7.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.

భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు దెబ్బతినడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల తొలగింపు, క్షతగాత్రుల తరలింపు, బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Spread the love

Related News

Latest News