[t4b-ticker]

మంచి వర్షాలతో తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది.. మహంకాళి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి అండ: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, ఆగస్టు 03: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన సంప్రదాయ ‘రంగం’ కార్యక్రమం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిశాయని తెలిపారు. అమ్మవారి భవిష్యవాణి ప్రకారం తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించినట్లు చెప్పారు.

బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. దేవాదాయ, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ తదితర శాఖలు సమిష్టిగా పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేశాయని ప్రశంసించారు.

ఈసారి ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం, ఇతర సౌకర్యాల కారణంగా గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో కొన్ని ప్రాంతాల్లో రద్దీ, ట్రాఫిక్ సమస్యలు ఎదురైనప్పటికీ ప్రజలు సహనంతో సహకరించారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జోగినీల ప్రతినిధులు దేవాలయాల్లో దర్శనాల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరిన విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అలాగే జోగినీలకు మున్సిపల్ కార్పొరేషన్లలో సభ్యత్వం కల్పించే అంశంపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుందని, వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు.

దేవాదాయ శాఖ కమిటీల్లో జోగినీలకు తగిన గుర్తింపు కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన అంశంపై దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక సమర్పించనుందని, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భవిష్యత్తులో మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News