ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 21: ఆధునిక సమాజంలో మనిషి శారీరక శ్రమ చేయకపోవడం మానసిక ఒత్తిడి అధిక రక్తపోటు వల్ల గుండె సంబంధించిన వ్యాధులు వస్తాయని మనిషి గుండె వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యశోద హాస్పిటల్ ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ శశి శ్రీవాత్సవ్ అన్నారు. శుక్రవారం మెదక్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గతంలో సాధారణంగా 60 ఏళ్ల తర్వాత కనిపించే గుండె సమస్యలు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు నుంచే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గుండె ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం, నడక లేకపోవడం, అధిక ఉప్పు తీసుకోవడం, మానసిక ఒత్తిడి, బీపీ, షుగర్‌ను నియంత్రించుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు.
రోజువారీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని నియంత్రించుకోవాలని, అధికంగా మటన్ తీసుకోవడం తగ్గించి చేపలు, గుడ్లు, చికెన్ వంటి ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిదని సూచించారు. రోజుకు తగినంత నిద్ర పొందడంతో పాటు, క్రమం తప్పకుండా నడక, శారీరక వ్యాయామం చేయాలని చెప్పారు.గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించేందుకు అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు సీటీ స్కాన్ వంటి ఆధునిక పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పుట్టుకతో గుండెలో ఏర్పడిన కొన్ని రకాల రంధ్రాలను కూడా ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చికిత్స చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శశి శ్రీవాత్సవ్ తెలిపారు. వ్యాయామాన్ని ప్రారంభించే ముందు, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా ప్రమాద కారకాలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలని ఆయన సూచించారు.
*అప్రమత్తం చేసే సంకేతాలు
ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఛాతీ మధ్యలో భరించలేని నొప్పు లేదా ఒత్తిడి ఎడమ చెయ్యి, దవడ, లేదా వీపు భాగంలోకి వ్యాపించే నొప్పి కొద్దిపాటి నడకకే విపరీతమైన ఆయాసం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం
*గుండెను పదిలంగా ఉంచుకునే మార్గాలు
రోజూ వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.
సమతుల ఆహారం: పండ్లు, ఆకుకూరలు మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నూనె, ఉప్పు, మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించాలి.
ఒత్తిడి నివారణ: యోగా, ధ్యానం ద్వారా రోజువారీ మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
క్రమబద్ధమైన పరీక్షలు: 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా బిపి, షుగర్ మరియు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఆరోగ్యకరమైన జీవనశైలే
ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలితో మన గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని గుండెవైద్యులు శశి శ్రీవత్సవ సూచించారు.మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు






























