[t4b-ticker]

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన హైదరాబాద్ యువతి అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు

ప్రతిపక్షం, ఆగస్టు 05: ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఏడాది క్రితం ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లిన యువతి నుంచి గత నాలుగు నుంచి ఐదు నెలలుగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ప్రారంభంలో యువతి తరచూ ఫోన్ ద్వారా మాట్లాడేదని, అయితే గత కొన్ని నెలలుగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పాటు ఎలాంటి సందేశాలు కూడా అందడం లేదని తెలిపారు. దీంతో ఆమె భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి విదేశీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు, ఉద్యోగ సంస్థ సమాచారం, చివరిసారిగా ఎక్కడ ఉన్నారనే అంశాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

అవసరమైతే విదేశాంగ శాఖ, సంబంధిత దౌత్య కార్యాలయాల సహకారంతో యువతి ఆచూకీని గుర్తించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News