ప్రతిపక్షం, ఆగస్టు 14: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి చిన్నారులపై పడింది. ఈ ప్రమాదంలో మూడో తరగతి విద్యార్థిని హలీమా తీవ్రంగా గాయపడి చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందింది. మరో పలువురు విద్యార్థులు గాయపడగా, ఇద్దరు చిన్నారుల కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
సుమారు 50 ఏళ్ల నాటి ఈ వేపచెట్టుకు ఆరు నెలల క్రితం లోపల మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నప్పటికీ చెట్టు బలహీనంగా మారిందని అప్పుడే హెచ్చరించినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రమాదకరంగా మారిన చెట్టును తొలగించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పందించారు. మృతి చెందిన హలీమా కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించి వారి వైద్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
పాఠశాలల ఆవరణల్లో ప్రమాదకరంగా మారిన చెట్లు, భవనాలు, విద్యుత్ లైన్లను అధికారులు వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.





























