ప్రతిపక్షం, జూలై 28: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయి. ఇటీవల పలువురు ప్రజాప్రతినిధుల మధ్య చోటుచేసుకుంటున్న విభేదాల నేపథ్యంలో దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా సమావేశమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాల తరహాలోనే రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని దళిత ప్రజాప్రతినిధులు అభిప్రాయపడినట్లు సమాచారం. తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని, కొందరు నాయకుల పెత్తనం పెరుగుతోందన్న అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.
దళిత ప్రజాప్రతినిధుల సంఘం ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, కన్వీనర్ మల్లు రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తమ సమస్యలు ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు పలువురు అభిప్రాయపడినట్లు సమాచారం.
ఈ పరిణామాల మధ్య ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా దళిత ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తగ్గించి సమన్వయం సాధించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
దళిత నాయకుల అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అంతర్గత విభేదాలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని నాయకులు కోరినట్లు సమాచారం.

















