ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణలో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంలో టీ-ఫైబర్ సేవల విస్తరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నిర్ణీత గడువులోగా ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని సూచించారు. సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తూ బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిధుల ఆదాతో పాటు అన్ని శాఖలకు ఒకే డిజిటల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాలు వినియోగిస్తున్న టీ-స్వాన్ (T-SWAN) నెట్‌వర్క్‌ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్‌కు మార్చాలని అధికారులకు గడువు విధించారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీకి అత్యాధునిక టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని వేగవంతం చేసి గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించాలని సూచించారు.
తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు.

















