ప్రతిపక్షం, ఆగస్టు 31: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతవడంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. వారు యాత్రకు కొంత ఆలస్యంగా వెళ్లి ఉంటే ఈ ఘోరవిపత్తులో చిక్కుకునే పరిస్థితి వచ్చేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యాత్రికులు సమయానికి అక్కడికి చేరుకోవడంతోనే భారీ వరదల బారిన పడ్డారని సద్గురు తెలిపారు. గల్లంతైన వారంతా ఇమిగ్రేషన్ కేంద్రంలో ఉన్నారని, వరదల కారణంగా వారి లగేజీలు కొట్టుకుపోయినా వారు ప్రాణాలతో బయటపడతారని భావించామని చెప్పారు.
అయితే ఊహించని స్థాయిలో వరద ఉధృతి పెరిగి, ఇమిగ్రేషన్ కేంద్రం ఉన్న భవనాన్నే వరద నీరు ముంచెత్తిందని సద్గురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
గల్లంతైన యాత్రికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు, అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. యాత్రికులు సురక్షితంగా తిరిగి రావాలని ఇషా ఫౌండేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.





























