[t4b-ticker]

కోమటిరెడ్డి సరితకు ట్రంప్‌ మద్దతు.. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ రేసులో కీలక పరిణామం

ప్రతిపక్షం, ఆగస్టు 19, హైదరాబాద్‌: అమెరికాలోని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవికి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి సరితకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు ప్రకటించారు. రిపబ్లికన్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న సరితకు ట్రంప్‌ మద్దతు ఇవ్వడం ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవికి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సరితకు ప్రత్యర్థిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జేమ్స్‌ ఉన్నారు. ఈ ఎన్నికలో జేమ్స్‌ ఓటమి తప్పదని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం. సరితకు మద్దతుగా ప్రచారం చేస్తూ ఆమెను గెలిపించాలని ట్రంప్‌ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

కోమటిరెడ్డి సరితకు తెలంగాణతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌కు చెందినవారు. 1980లలో వారు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనంతరం సరిత అమెరికాలోనే జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. వివాహిత అయిన సరితకు నలుగురు పిల్లలు ఉన్నారు.

అమెరికా రాజకీయాల్లో కీలకమైన రాష్ట్రాల్లో న్యూయార్క్‌ ఒకటి కావడంతో అటార్నీ జనరల్‌ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సరితకు ట్రంప్‌ బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఆమె ఎన్నికల ప్రచారానికి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూయార్క్‌లోని కీలక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ సరిత తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

తెలంగాణ మూలాలున్న సరితకు ట్రంప్‌ మద్దతు లభించడంతో అమెరికాతో పాటు తెలంగాణలోనూ ఈ అంశం ఆసక్తికరంగా మారింది. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ఎన్నికలో సరిత విజయం సాధిస్తారా లేదా అన్నది నవంబర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

Spread the love

Related News

Latest News