సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి

మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులూ అప్‌డేట్ కావాలి!

విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలి

సిబ్బందికి మల్టీ జోన్‌-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి దిశానిర్దేశం

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 12: మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసు సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని మల్టీ జోన్‌-1 ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణకు పెద్దపీట వేయాలని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని పేర్కొన్నారు.వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట పోలీస్ స్టేషన్‌ను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.

సిబ్బంది సమస్యలపై ఆరా.. విధులపై సమీక్ష

తనిఖీల సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఐజీ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి విధి నిర్వహణ తీరు, ఎదురవుతున్న సవాళ్లు, వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, ఎక్కువగా నమోదవుతున్న నేరాలు, వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.గతంతో పోలిస్తే ప్రస్తుతం పోలీసు విధానాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని ఐజీ పేర్కొన్నారు. అదే సమయంలో నేరగాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మారుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బంది నిరంతరం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని తెలిపారు. నేరాల నివారణలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఐజీ ఆదేశించారు. ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసు సిబ్బంది నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని చెప్పారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.

విధులతో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యం

పోలీసు విధులు ఒత్తిడితో కూడుకున్నవని తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఐజీ సూచించారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతిరోజూ వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్నా, వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లినా ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. పోలీసులు రహదారి భద్రతా నిబంధనలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

కేసుల దర్యాప్తులో నాణ్యత కీలకం

అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, ట్రయల్ దశలో ఉన్న కేసుల పురోగతిని ఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా పటిష్టమైన ఆధారాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.దర్యాప్తు ప్రక్రియలో నిర్దేశిత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌ఓపీ) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు.

స్టేషన్ పనితీరు, కిట్ ఆర్టికల్స్ పరిశీలన

పోలీసు సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి వాటి నిర్వహణ, వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న నేరాలకు సంబంధించిన వాహనాలను పరిశీలించారు. రిసెప్షన్ వర్టికల్ పనితీరు, స్టేషన్‌కు ఏటా అందుతున్న ఫిర్యాదుల సంఖ్య, వాటి పరిష్కార తీరును సమీక్షించారు.అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ముందుగానే గుర్తించి అడ్డుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, ఇన్‌స్పెక్టర్లు కిరణ్, లతీఫ్, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ వివేక్, చిన్నకోడూరు ఎస్‌ఐ చంద్రమోహన్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News