ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 03: గోదావరిలో వరదలు వస్తే ప్రజల సమస్యలపై స్పందించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం అబద్ధాల ప్రచారం చేయడం భారాస నాయకులకు అలవాటుగా మారిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.సోమవారం భారాస నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మాట్లాడుతూ, మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోవాలని చేస్తున్న డిమాండ్లు వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు. సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేకుండానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.గోదావరిలో వరద ప్రవాహం ఉండటం ఒక విషయం కాగా, ఆ నీటినంతా వెంటనే ఎత్తిపోసే అవకాశం ఉండటం మరో విషయమని మంత్రి వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ రాజకీయ ప్రకటనలతో కాకుండా నీటి మట్టాలు, పంపింగ్ సామర్థ్యం, కాలువల మోయగల సామర్థ్యం, దిగువ జలాశయాల నిల్వలు, విద్యుత్ లభ్యత, ఇంజినీర్ల సాంకేతిక అనుమతులు, భద్రతా ప్రమాణాల ఆధారంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
మేడిగడ్డపై మాట్లాడే నైతిక హక్కు భారాసకు లేదు
తెలంగాణ ప్రజల సొమ్ముతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ఈ పరిస్థితికి ఎందుకు చేరిందో ముందుగా భారాస నాయకులే సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందని, ఇప్పుడు అదే ప్రాజెక్టు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.
గ్రావిటీ, ఎత్తిపోతలు రెండూ ఒకటి కావు
ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీటి తరలింపుపై భారాస నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల రూపకల్పన ప్రకారం ఎక్కడ గ్రావిటీ సాధ్యమో అక్కడ గ్రావిటీ ద్వారా, అవసరమైతే ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు జరుగుతుందని, ఇది పూర్తిగా సాంకేతిక అంశమని స్పష్టం చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారు?
తుమ్మిడిహెట్టి పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన భారాస పదేళ్ల పాలనలో ఆ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో మంత్రి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి విమర్శించడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని అన్నారు.
రైతుల ప్రయోజనమే ప్రభుత్వ లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందేలా శాస్త్రీయ విధానంలో ప్రాజెక్టుల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. రాజకీయ ప్రచారం కోసం కాకుండా నిపుణుల సలహాలు, సాగునీటి శాఖ ఇంజినీర్ల సాంకేతిక సూచనల మేరకు ప్రతి నిర్ణయం తీసుకుంటోందని పేర్కొన్నారు.

















