ప్రతిపక్షం, జూలై 31, వికారాబాద్: సమాజాన్ని కలిచివేసే దారుణ ఘటన వికారాబాద్లో వెలుగుచూసింది. రక్షణగా నిలవాల్సిన కన్నతండ్రే తన మైనర్ కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాలిక ధైర్యంగా విషయం బయటపెట్టడంతో నిందితుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల వివరాల ప్రకారం, వికారాబాద్ పట్టణానికి చెందిన ఓ బాలిక ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లింది. అయితే తరగతుల సమయంలో కడుపునొప్పితో బాధపడుతుండటాన్ని గమనించిన ఉపాధ్యాయురాలు ఆమెను ఆరా తీశారు. తొలుత మౌనంగా ఉన్న బాలిక, ఉపాధ్యాయుల ధైర్యం చెప్పడంతో తన తండ్రి జగన్నాథం పలుమార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించింది.
ఈ విషయాన్ని వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
తదుపరి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వికారాబాద్ సీఐ రఘుకుమార్ తెలిపారు. బాధిత బాలికకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కౌన్సెలింగ్ అందించే చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేయగా, బాలలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు కనిపించినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెంటనే స్పందించి వారి సమస్యలను తెలుసుకోవాలని, ఇలాంటి ఘటనలు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

















