ప్రతిపక్షం, సెప్టెంబర్ 21: తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యమ సమయంలో కేదారి దంపతులు చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి, పుష్పలత దంపతులు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో తమ వంతుగా సమాజ సేవ చేశారు. సాధారణ హోటల్ నిర్వహిస్తూ ఉద్యమకారులు, ప్రజలకు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీ అందించేవారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆహారాన్ని వృథా చేయకూడదని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ఆర్థిక ప్రయోజనాలను ఆశించకుండా ఉద్యమకారులకు అండగా నిలిచిన కేదారి దంపతుల సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. వారి సేవా భావాన్ని, ఉద్యమం పట్ల వారు చూపిన అంకితభావాన్ని పరిగణనలోకి తీసుకుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
లింగాల కేదారి సెప్టెంబర్ 9, 2026న, ఆయన భార్య పుష్పలత సెప్టెంబర్ 10, 2026న విషాదకర సంఘటనలో మృతి చెందారు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు.
మంజూరైన ఆర్థిక సాయం అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను అధికారులు ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేదారి దంపతులు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.





























