[t4b-ticker]

ఏకలవ్య పాఠశాల దగ్గర ఆదివాసీ సంఘాల దీక్ష

ప్రతిపక్షం గుండాల, ఆగస్టు 19: మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష బుధవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉపాధ్యాయులు పాఠశాలలో జరుగుతున్న విషయాలను బయటకు చెబుతున్నారనే కారణంతో కొందరు లంబాడా ఉపాధ్యాయులు గిరిజన విద్యార్థులు, గిరిజన ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధమైన జాతి వివక్షపూరిత ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ దీక్ష చేపట్టినట్లు తెలిపారు.

ఈ నెల 14వ తేదీన పాఠశాలలో నిర్వహించిన తీజ్ పండుగను ఆదివాసీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారని, అయితే పాఠశాలలో జరుగుతున్న విషయాలను గిరిజన ఉపాధ్యాయులు బయటకు చెప్పడం కారణంగానే తమ తీజ్ పండుగకు అడ్డుపడ్డారనే కారణంతో గిరిజన ఉపాధ్యాయులపై లంబాడా ఉపాధ్యాయులు వివక్ష చూపుతున్నారని అన్నారు.పాఠశాలలో విద్యార్థుల పట్ల అన్యాయం జరుగుతోందని, వారిపై ఒత్తిళ్లు, వేధింపులు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇది పూర్తిగా ఏజెన్సీ మండలం కావడంతో ఏకలవ్య పాఠశాలలో అర్హత లేని వారిని తొలగించి, అర్హులైన గిరిజన అభ్యర్థులను నియమించాలని కోరారు.సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

దీక్షా శిబిరాన్ని ఆర్‌సీఓ అరుణ సందర్శించి సంఘ నాయకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సంఘ నాయకులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆదివాసీ సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్‌సీఓకు అందజేశారు.ఈ సందర్భంగా ఆర్‌సీఓ అరుణ మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదులు, డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైన విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పరిధిలో నేరుగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారాలు లేవని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్యదొర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, పినపాక జాయింట్ యాక్షన్ కమిటీ మండల అధ్యక్షులు వెంకట్, పెండకట్ల నాగరాజు, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు అలెం కోటి, మోకాల వీరస్వామి, పూనెం రమణ బాబు,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News