ప్రతిపక్షం, నవంబర్ 24: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులకు పదేపదే కోప్పడటం, గట్టిగా అరవడం వారి మానసిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ జీవితంలో కొన్ని సమయాల్లో పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ పిల్లలతో ప్రేమగా, ఓపికగా మాట్లాడితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వివరిస్తున్నారు.
పిల్లలు ఉదయం నిద్రలేచిన వెంటనే వారిపై అరవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే తిట్లు, కఠినమైన మాటలు ఎదురైతే పిల్లల మానసిక స్థితి దెబ్బతిని రోజంతా చిరాకు, నిరుత్సాహంతో గడిపే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అందుకే ఉదయం నిద్రలేచిన తర్వాత వారితో ప్రశాంతంగా మాట్లాడాలని, పాఠశాలకు సిద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వాలని చెబుతున్నారు. అలాగే పిల్లలు భోజనం చేస్తున్న సమయంలోనూ వారిని మందలించడం, తిట్టడం చేయకూడదని సూచిస్తున్నారు. తినేటప్పుడు ఒత్తిడికి గురిచేస్తే ఆహారంపై ఆసక్తి తగ్గి, ఆకలి మందగించే అవకాశం ఉందని వివరిస్తున్నారు. భోజనం చేసే సమయంలో ప్రశాంతమైన వాతావరణం కల్పించడం అవసరమని చెబుతున్నారు.
పిల్లలు పాఠశాలకు వెళ్లే ముందు కూడా వారిపై కోప్పడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తల్లిదండ్రులు గట్టిగా అరవడం, తప్పుల గురించి పదేపదే గుర్తుచేయడం వల్ల పిల్లలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం పాఠశాలలో వారి ఏకాగ్రత, చదువుపై పడవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందు పిల్లలను తిట్టడం, భయపెట్టడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. రోజంతా జరిగిన సంఘటనలతో పాటు తల్లిదండ్రులు అన్న కఠినమైన మాటలు కూడా వారి మనసులో మెదులుతూ నిద్రకు ఆటంకం కలిగించవచ్చని వివరిస్తున్నారు. అందువల్ల నిద్రకు ముందు పిల్లలతో ప్రేమగా మాట్లాడి, వారి రోజువారీ అనుభవాలను తెలుసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు అందరి ముందు అవమానించడం లేదా ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం కూడా నివారించాలని నిపుణులు చెబుతున్నారు. తప్పు చేసిన విషయాన్ని నలుగురిలో ప్రస్తావించకుండా, పిల్లలతో ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడాలని సూచిస్తున్నారు. వారు ఎందుకు అలా చేశారో తెలుసుకుని, ఆ ప్రవర్తన వల్ల కలిగే పరిణామాలను అర్థమయ్యేలా వివరించాలి. తల్లిదండ్రుల మాటల్లో ప్రేమ, ఆప్యాయతతో పాటు అవసరమైన క్రమశిక్షణ కూడా ఉండాలని చెబుతున్నారు. పిల్లలను భయంతో కాకుండా అవగాహనతో సరైన మార్గంలో నడిపించడం ముఖ్యమని సూచిస్తున్నారు.


























