*పరామర్శించిన డీఎస్పీ.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలింపు
ప్రతి పక్షం,వేములవాడ, నవంబర్ 18: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
బుధవారం ఉదయం విధుల్లో భాగంగా పట్టణంలోని చెక్కపల్లి రోడ్డులో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం సమీపంలో విధులు నిర్వహిస్తుండగా, ఎదురుగట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారుతో ఆయనను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రశాంత్ కుడి కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలిసింది. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.
విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ఏరియా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన కానిస్టేబుల్ ప్రశాంత్‌ను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.





























