ప్రతిపక్షం, నవంబర్ 16: తెలంగాణలో 2026-27 వానాకాలం, యాసంగి పంట సీజన్లకు సంబంధించి రైస్ మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ కఠిన నిబంధనలు అమలు చేసేందుకు కొత్త ఒప్పందాన్ని రూపొందించింది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలు, కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియ, ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన బియ్యం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపడుతోంది. ధాన్యం నిల్వలు తగ్గినా, కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించినా సంబంధిత మిల్లర్లపై భారీ జరిమానాలు విధించడంతో పాటు నష్టపోయిన మొత్తాన్ని వడ్డీతో సహా వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైస్ మిల్లర్లతో చేసుకునే ఒప్పందంలో బాధ్యతలు, నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయిస్తుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మర పట్టించి, నిర్ణయించిన నిబంధనల ప్రకారం కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్)ను తిరిగి పౌర సరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే గతంలో ధాన్యం నిల్వల్లో తేడాలు రావడం, కేటాయించిన ధాన్యాన్ని ఇతర అవసరాలకు మళ్లించడం, సీఎంఆర్ అప్పగించడంలో జాప్యం వంటి అంశాలు ప్రభుత్వానికి సమస్యగా మారిన నేపథ్యంలో ఈసారి నిబంధనలను కఠినంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ధాన్యం నిల్వలు తగ్గినట్లు గుర్తించినా, వాటిని పక్కదారి పట్టించినట్లు తేలినా మిల్లర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత బకాయిలను వడ్డీతో సహా రికవరీ చేయనున్నారు.
కస్టమ్ మిల్ల్డ్ రైస్‌ను నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అప్పగించడం మిల్లర్లకు తప్పనిసరి. గడువు దాటినా సీఎంఆర్ అందించని మిల్లులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే నిబంధనను కొత్త ఒప్పందంలో పొందుపరిచారు. దీంతో గడువుల విషయంలో మిల్లర్లు నిర్లక్ష్యం వహించేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎంఆర్ అప్పగించే వరకు మిల్లులకు కేటాయించిన ధాన్యం, గన్నీ సంచులు, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) బాధ్యత పూర్తిగా మిల్లర్లపైనే ఉంటుంది. ఈ నిల్వలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సంరక్షించాల్సిన బాధ్యత కూడా వారిదే.
అంతేకాకుండా ధాన్యం, గన్నీ సంచులు, ఎఫ్ఆర్కేలకు బీమా చేయించడం తప్పనిసరి చేశారు. నిల్వలకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిబంధనను తీసుకొచ్చారు. బీమా ఏర్పాటు చేయడంతో పాటు కేటాయించిన ధాన్యం నిల్వలను సురక్షితంగా ఉంచడం, వాటి వివరాలను సక్రమంగా నిర్వహించడం, నిర్ణీత సమయంలో సీఎంఆర్ అప్పగించడం వంటి బాధ్యతలను మిల్లర్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 2026-27 రెండు పంట సీజన్లకు సంబంధించి రూపొందించిన ఈ కొత్త ఒప్పందం ద్వారా ధాన్యం నిల్వల నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టకుండా నియంత్రించడమే పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.



























