మెదక్ కలెక్టరేట్ ఎదుట రెండో రోజు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరాహార దీక్ష

దీక్షకు బీఆర్‌ఎస్‌ నాయకుల మద్దతు

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 14: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం మెదక్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్ష బుధవారం రెండో రోజుకు చేరింది. ఈ దీక్షకు భారత రాష్ట్ర సమితి నాయకులు మద్దతు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్యాడర్ ఫిక్సేషన్ చేపట్టి 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీలో కొనసాగిస్తూ నేరుగా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

2022 నుంచి ఏటా ఐదు శాతం ఇంక్రిమెంట్‌తో పాటు ఎనిమిది శాతం లాయల్టీ బోనస్ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా లేదా బీమా పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి అర్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రతతో పాటు ఈహెచ్‌ఎస్‌/ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, నెలకు ఐదో తేదీలోపు జీతాలు చెల్లించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల పీఆర్‌సీ బకాయిలను విడుదల చేయడంతో పాటు జీవో నంబర్లు 60, 1195 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని, వేతనాలు తగ్గిన ఉద్యోగులకు పూర్వపు వేతనాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జాయింట్ యాక్షన్ కమిటీ మెదక్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వినోద్, ప్రధాన కార్యదర్శి శ్రీలత సురేష్, సాయికిరణ్, క్రాంతి, కోట, రమేష్, మధు, దుర్గమణి, నిర్మల, నవీన్, సుభాషిణి, దుర్గరాజు, తన్వీర్ సుల్తానా, రాజలక్ష్మి, రాజశేఖర్, నిఖిల్, మాధురి, మహేష్, అమృతి, జ్యోతి, యాదమ్మ, ప్రియాంక, సాయి దీప్తి, శ్రీనివాస్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్, కౌన్సిలర్ ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, జుబేర్, నాయకులు మాయా మల్లేశం, భీమరి కిషోర్, లింగారెడ్డి, సాధిక్ తదితరులు మద్దతు తెలిపారు.

Spread the love

Related News

Latest News