బాలబాలికల హక్కులను కాపాడాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రుబీనా ఫాతిమా
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 27 : బాల్య వివాహాలు పిల్లల బాల్యాన్ని, విద్యను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సామాజిక సమస్య అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రుబీనా ఫాతిమా అన్నారు. అంతర్జాతీయ బాల్య వివాహాలు మరియు బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెదక్ పట్టణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి పోస్ట్ ఆఫీస్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రుబీనా ఫాతిమా మాట్లాడుతూ ప్రతి బాలబాలికకు విద్యను అభ్యసించే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు, తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే హక్కు ఉందన్నారు.
బాల్య వివాహాలను అరికట్టడం ఒక్కరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు సమన్వయంతో పనిచేసి బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్యకు ఆటంకం కలగడమే కాకుండా వారి ఆరోగ్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, మెదక్ పట్టణ సీఐ మహేష్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం చీఫ్ కరుణాకర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు ఉప్పలయ్య, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






























