రాజ్యాంగ స్ఫూర్తితో భావి భారత పౌరులుగా ఎదగాలి

హక్కులను వినియోగించుకుంటూ బాధ్యతలను నెరవేర్చాలి

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రతిపక్షం,నంగునూరు, నవంబరు 26: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ, రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వర్తించాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రధానాచార్యుడు బూరం అభినవ్ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు క్రమశిక్షణ, సమానత్వం, సోదర భావం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజగోపాలపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యుడు భూరం అభినవ్ భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. విద్యార్థులు, అధ్యాపకులు సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశ ప్రజలు అణచివేత, దోపిడీ, సామాజిక వివక్ష వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దూరదృష్టి, కృషి కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా దేశ పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలతో పాటు ప్రాథమిక హక్కులు లభించాయని వివరించారు.

రాజ్యాంగం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందవచ్చన్నారు. గిరిజన కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి స్థానాన్ని అధిరోహించడం రాజ్యాంగం అందించిన సమాన అవకాశాలకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసు కోవడంతో పాటు విధులను కూడా గుర్తించి నడుచుకోవాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుతూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఆంగ్ల అధ్యాపకుడు సయ్యద్ షాహేబాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విశిష్టత, ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, పౌరుల హక్కులు, బాధ్యతల గురించి విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగ విలువలను జీవితంలో ఆచరించాలని, సమాజంలో సమానత్వం, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు అభినందనలు తెలిపారు. అధ్యాపకురాలు కవిత వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు పాతూరి శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, రాజమౌళి, పరిపాలనాధికారి రాజేశ్, జాతీయ సేవా పథకం కార్యక్రమ అధికారి మధుబాబు, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related News

Latest News