తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ కీలక సమావేశం.

-సంస్థ విస్తరణ, బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఏకగ్రీవ తీర్మానాలు.

ప్రతిపక్షం, సిరిసిల్ల, నవంబర్ 21: తెలంగాణ జానపద కళారంగ అభివృద్ధి, కళాకారుల సంక్షేమం, హక్కుల సాధన, రాష్ట్ర వ్యాప్తంగా జానపద పరిశ్రమను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ కీలక సమావేశం సిరిసిల్ల పట్టణంలోని చిత్ర బాంకెట్ హాల్‌లో రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాటి రమణాకర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఈ నెల 03న సిరిసిల్లలో నిర్వహించిన తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాలను సంస్థ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ కన్వీనర్ మహమ్మద్ సత్తార్ సభ్యులకు వివరించారు. ఆదాయ, ఖర్చుల వివరాలను పరిశీలించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక ఇబ్బందులు ఎదురైనా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, సిరిసిల్ల కళాకారుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా వెల్లడించిన మహమ్మద్ సత్తార్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు.

ఆయన సమర్పించిన లెక్కలకు సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అనంతరం సంస్థ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా సంస్థ విస్తరణ, సభ్యత్వ నమోదు, కళాకారుల ఐక్యత, హక్కుల సాధన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ కమిటీ నూతన నియామకాలు :
రాష్ట్ర అధ్యక్షులుగా పత్తిపాటి రమణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ సత్తార్, రాష్ట్ర కోశాధికారిగా ఎర్రం వేణు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కళాంజలి రాజేష్, ఏదుల జంగిరెడ్డిలను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోదారి శ్రీనివాస్, స్టేట్ కోఆర్డినేటర్ గా దరువు అంజన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గడ్డం సంతోష్, మానుకోట ప్రసాద్లను,
రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఆకునూరు దేవయ్య, అధికార ప్రతినిధిగా ఎడమల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా మంకాల ప్రసాద్, చీకోడు నరసింహులు, రాష్ట్ర మహిళా ప్రతినిధులుగా తేలు విజయ, ఒల్లాల వాణిలతో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా కాపర్తి మల్లికార్జున్, జడల రమేష్, వడ్లకొండ అనిల్ కుమార్, కందుకూరి శంకర్ బాబు, కాదూరి గణేష్, వస్పరి విష్ణు, మాట్ల తిరుపతి, కోడం సంతోష్, మల్లిక్ తేజ, బైరాగి మోహన్, అభినయ శ్రీనివాస్, బుర్ర సతీష్, నక్క శ్రీకాంత్, వీణ మేడ్చల్‌లను వివిధ బాధ్యతల్లో నియమిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న జానపద కళాకారులు, సాంకేతిక నిపుణులు, సృజనాత్మక రంగ ప్రతిభావంతులకు సంస్థలో సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా జానపద, భక్తి, సామాజిక గేయ రచయితలు, గాయకులు, గాయనీమణులు, సంగీత దర్శకులు, కీబోర్డ్ ప్లేయర్లు, సంగీత కళాకారులు, స్టూడియో ఇంజినీర్లు, కెమెరామెన్లు, వీడియో ఎడిటర్లు, కొరియోగ్రాఫర్లు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలను సభ్యులుగా చేర్చుకోవాలని తీర్మానించారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అర్హులైన కళాకారులను గుర్తించి సభ్యత్వ నమోదు ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వారీగా ఇన్‌చార్జిలను నియమించాలని నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి జిల్లాలో సంస్థను పటిష్టమైన వ్యవస్థగా నిర్మించడంతో పాటు జానపద కళాకారుల ఐక్యత, సంక్షేమం, హక్కుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా మహమ్మద్ సత్తార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలను సిరిసిల్లలో నిర్వహించే బాధ్యతను తనపై నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, సిరిసిల్ల కళాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ జానపద కళారంగ అభివృద్ధి, కళాకారుల ఐక్యతే లక్ష్యంగా సంస్థను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయాలని సమావేశం సంకల్పించిందని తెలిపారు.

Related News

Latest News